హైదరాబాద్, వెలుగు: వరంగల్ సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వారు మాట్లాడారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వరంగల్అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ భూసేకరణ కోసం రూ.300 కోట్లు కేటాయించారని, భూసేకరణ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.
తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్..!
తెలంగాణకు వరంగల్ రెండో రాజధానిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జిల్లా అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఎంపీ కడియం కావ్య అన్నారు. అభివృద్ధి పనుల కోసం ఇప్పటివరకు రూ.6 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. నగరంలో ప్రధానంగా అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తూ జీవో ఇవ్వడం చారిత్రాత్మకమన్నారు. దశాబ్దాలుగా మరుగునపడ్డ మామునూరు ఎయిర్ పోర్ట్ సాకారం కానుందని తెలిపారు. వరంగల్ చుట్టూ త్వరలోనే ఔటర్ రింగ్ రోడ్ పనులు ప్రారంభంకానున్నాయని పేర్కొన్నారు.
